Thursday, 27 August 2020

Kanaka mahalaxmi Recording dance troup

సినిమా అంటే, రంగుల కలలూ, నాలుగు వీరబాదుడు ఫైట్లు, విదేశీ కనువిందులు, అరకొర కురచ వస్త్రాలతో దేహ ప్రదర్శన. అలా కాకుండా, కొన్నుంటాయి. అచ్చం మనలాగే.. ఈయన సినిమాలు.అక్కడ రోజూ మనం తిరిగే ప్రదేశాలే ఇంతందంగా ఉన్నాయేంటని ప్రశ్నించుకునేలా చేస్తాయి. సహజ సన్నివేశాలు చెప్పనే అక్కర్లేదు. వాస్తవంలో జరిగే విషయాలే సున్నితమైన హాస్యంతో మిళితమై అలరిస్తాయి. ఇదంతా, గోదారివాస్తవ్యులు వంశీ గారి చిత్రాల్లో అలవోకగా జరిగిపోతుంది. ఆయన చిత్రంలో పాటలు, పొదిగిన ముత్యాలంటే అతిశయం కాదు. ఇంకా.. చక్కని సంగీతాన్ని మేళవించి, పదం పదం, పరమపద పరవశానికి చేర్చేట్టుంటాయి ఒక్కో పాటా, దాని భావం. వేటూరి గారి గురించి చెప్పేదేముంది. అపరసరస్వతీ కటాక్ష జనితులు. చిన్న పదాలతో ఉత్కృష్టమైన లాలిత్యాన్ని రంగరించి మైమరపులోకి దింపేస్తారు. అసలు జీవించడానికి కావలసిన తృప్తినంతా రంగరించి రాసినట్టుంటుందీ పాట. దానికి లయరాజా గారు, మరిన్ని సొబగులద్ది వివశత్వాన్ని రెట్టింపు చేసేసారు. "కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్" చిత్రంలో ఎక్కువగా, అప్పటికే బాగా హిట్ అయిన పాటలున్నాయి. అవి కాక, అదనంగా అద్భుతమైన పాటలు రెండున్నాయి. అందులో "ఏనాడు విడిపోని ముడివేసేనే" అనే పాట ఇది. ఒక అనుబంధంలోని రసానుభూతి, వెన్నెల వర్షం కురిసినంత ఆహ్లాదంగా అనిపిస్తుంది. మోహఋతువులోని అందాన్ని మోహనరాగానికి శృతిచేసి తాళమేసినట్టు ముచ్చటేస్తుందీ పాట విన్న ప్రతిసారీ. ఆమనినీ, యామినినీ విడువకుండా, అలలనీ, కలలనీ వాటికి కలిపి మరీ విరచించారు మన రసరాజుగారు . మనసులో ఒక్కో పొరను తీగను చేసి మీటుతున్న తీయని భావన మొదలై తనువో అనుభూతి గీతికైతే, ఆ చిరువెచ్చని పరివేదనకి గుండె అంచున తళుక్కున మెరిసే గున్నమావిపువ్వు ఆనందానికి ఊపిరి పోస్తున్నట్లు వుంటుందీ పాట.. అంతరంగపు తరంగాలకి గుడిగంటలు మోగినట్టు, కనుచూపుల మసకవెలుతురులో అనురాగపు దివ్వెలు సంచలిస్తుంటాయి. గోదారి మధ్యన ఊగే పడవలో ఉండగా గాలి వీచినప్పుడల్లా కొండమల్లెల పరిమళం గుప్పుమన్నప్పుడు మనసు తడిచే వివశత్వం ఎంత గమ్మత్తుగా ఉంటుందో, ఒక వేకువ సౌందర్యానికి ఉన్మత్తమయ్యేవారికి మాత్రమే తెలుస్తుంది. మధురంగా అనిపించేవన్నీ సహజత్వానికి ఎంత దగ్గరగా ఉంటాయో..ప్రణయంలో చూపులెక్కువగా మాట్లాడుతూ, మోవి మౌనంగా మిగిలిపోతూనే అన్నీ కళ్ళతో చెప్పిస్తుందనే రంజిత కూజితాలను వినిపించారు బాలూ, జానకీ గారు. నిశ్శబ్దానికి మాటలు నేర్పే క్షణాల ఉక్కిరిబిక్కిరితనం ఈ సాహిత్యానిది కనుకే తమ స్వరాలతో మత్తు జల్లేసారు. గతించిపోయిన జ్ఞాపకాలు వర్తమానంలోకి విచ్చేసి గోముగా గుసగుసలాడే అనుభవం కావాలంటే ఈ పాట విని తీరాల్సిందే. అతి మనోహరంగా, కొంచం విలక్షణంగా ఉంది కనుకనే ఈ పాట సరసహృదయుల నీరాజనాలందుకుంది. https://youtu.be/4yoSrSnfyOM