Tuesday, 29 December 2015

పాట : 36 : మైమరచి పాడుకున్నా నాలో నేనే..

పల్లవి:

మైమరచి పాడుకున్నా నాలో నేనే..
తొలి పులకింతయ్యిందేమో మరి..
కనుతెరిచే కలగంటున్నా నిన్నే..
ఏం మాయ చేసావో మరి..
నీ ఊహల వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నా..
పడిలేచే కెరటంలా ఎగిసిఎగిసి పడుతున్నా..
ఓ ప్రియతమా..

చరణం 1:
నిన్నలేని అందమేదో నాలో నిద్దురలేస్తుంటే కలవరపడనా
నిన్ను చేరని ఊహలేవో కలలో మెలిపెడుతుంటే తడబడనా..
మనసు జారిపోతుందంటూ ఎవరికి చెప్పాలో..
నీ చెలిమి తీపి కావలంటూ ఎవ్వరినడగాలో...
సన్నాయిపాటై వినబడింది నీ మౌనం..
కలలో రమ్మన్నట్లు నీ ఆహ్వానం...               //కనుతెరిచే కలగంటున్నా//

చరణం 2:

శతకోటి ఆశలు నిన్నే కోరుతువుంటే కాదని అననా..
మధుకావ్యమేదో మనసు రాశానంటే చదవను అననా..
తొలిచూపుల వలలో చిక్కానంటూ ఎవరికి చెప్పాలో..
వసంత భావాల వియోగాలు ఎక్కడ దాచాలో..
సిరిమల్లె ధూపమై ఎగిసింది నీ శ్వాస..
మధుమాసం చేరువై వెలిగింది నీ రూపం..              //మైమరచి//

పాట : 35 : ముందడుగేసిన నీ చొరవ నాలో మౌనాన్ని తాగింది..

పల్లవి:

అతను: కురిసింది మల్లెలజల్లు..తొలకరికో మరి తమకముకో..
బంధం గంధం నీ భావం..
ఆమె: ఎగిసింది నయనపువిల్లు..ఊహలకో మరి ఊరింతకో..
మృదులం మధురం నీ లాస్యం..


చరణం 1:

అతను: ముందడుగేసిన నీ చొరవ నాలో మౌనాన్ని తాగింది..
కనుసైగ చేసిన నీ చనువు నాలో మోహాన్ని రేపింది..
ఆమె: అచ్చమైన అందమంత వెన్నెలై విరిసింది..
ముత్యమంత ముద్దులోన విరహమంత తీరింది..
అతను: అఖిలం అరుణం నీ వదనం..
కవనం కెరటం నా సంగీతం..                            //ఎగిసింది//

చరణం 2:

ఆమె: మధువనిలో రాధనవనా నువ్వే శ్రీకరుడివనుకుంటే..
వనవాసపు సీతనేనవనా నువ్వే రాఘవుడివనుకుంటే..
అతను:నిన్నలేని ఆనందమంతా కోయిలై పాడింది
ఇన్నినాళ్ళ మురిపెమంతా వెల్లువై పొంగింది..
ఆమె: అధరం అందం నీ సొంతం..తరుణం భ్రమరం నీ ఆరాటం..     //కురిసింది//

పాట : 34 : మన్మధుడివి నువ్వేరా మనోహరా..

పల్లవి:
మన్మధుడివి నువ్వేరా మనోహరా..
మాయ చేసిన ఏకవీర రశేశ్వరా..
సరసస్వరూపం నువ్వేరా..
నన్ను నేనే మరచినారా సుధాకరా
మందరమై పూసినారా మగధీరా..
నాలోని సర్వం నీదేరా..

చరణం 1:
చూపులతో కాల్చేసే కన్నే నీదా
నీ చిలిపిదనం చిరునామా నా చెక్కిలిలో కనుగొన్నా..
నవ్వులతో చంపేసే జిన్నే నువ్వా..
నా పడుచుదనం నజరానా నీ తెగువకు రాసేసా..
తేనెసొగసులు చిలికిన ప్రణయం..
తనువంత తాకింది వింత మోహం...సరసస్వరూపం నువ్వేరా..                  //నన్ను నేనే//

చరణం 2:

వెన్నెలను చిందించే మూనే నువ్వా...
నులివెచ్చదనపు ఆనందం నీ కౌగిలిలో కనుగొన్నా..
మల్లెలను మరపించే మత్తే నీదా..
మదిపచ్చదనపు సౌందర్యం నా నీకే ఇచ్చేసా..
బుగ్గనచుక్కకు ఎదురుచూసే తరుణం..
ఎద నిండిపోయింది మధురస్వప్నం...నాలోని సర్వం నీదేరా...          //మన్మధుడివి//

పాట : 33 : పల్లవి: అతను: మనసయ్యింది నీపై ఎద మీటావనే..

పల్లవి:
అతను: మనసయ్యింది నీపై ఎద మీటావనే..
మధుమాస చిరునవ్వులతో నన్ను దోచావనే..
ప్రియా ప్రియతమా..నువ్వే సరిగమా..
ఆమె: మధువయ్యింది నేనే నిన్ను చేరాలనే..
పల్లవించు గీతాలలో నన్ను దాచావనే..
ప్రియా ప్రియతమా..నేనే నీ గమకమా.. 

చరణం 1:
ఆమె: నీ ఊహలోకొచ్చి చేరిపోయా..ప్రియురాలిగా నన్ను కలగన్నావనే..
నీ కన్నుల్లోకొచ్చి విరినయ్యా..రెప్పల్లో దాచుకుంటావనే..
అతను: ఊరించే ఊహలు..కలగలసిన కన్నులూ..
మైమరచే ఊసులూ..జతకలిసిన బాసలూ..
ఆమె: బంధాలై పెనవేసెను ప్రేమల్లో.. 
అతను: స్వర్గాలై విరబూసెను కౌగిలిలో..
ప్రియా ప్రియతమా..నువ్వే సరిగమా..

చరణం 2:
ఆమె: జడివానకే నే ఒణుకుతున్నా..వెన్నెల చల్లనై కురిసిందని..
కస్తూరినై పరిమళించా..సురద్వారం తెరిచుందని..
అతను: కవ్వించే పరువాలు..రేకెత్తెను మోహాలు..
చెరవేసే అందాలు..అవునంటే సరసాలు..
ఆమె: రాగాలై విరితేనెల పాటల్లో..
అతను: తాపాలై వెలిగిన చూపుల్లో..
ప్రియా ప్రియతమా..నేనే నీ గమకమా..