Thursday, 19 November 2015

పాట : 32 : ఆనందం మేఘమయ్యింది..పువ్వంటి నువ్వు నవ్వగానే.



పల్లవి:
అతను: ఆనందం మేఘమయ్యింది..పువ్వంటి నువ్వు నవ్వగానే..
ఆమె: అల్లరి వెల్లువయ్యింది..నీవన్న ఊసులు పాడగానే..
అతను: ప్రేమేననుకున్నా..పెదవుల్లో గుసగుసలు కన్నులు చూపుతుంటే..
ఆమె: వలపేననుకున్నా..చిలిపివెన్నెల మనపై ఇలా కురుస్తుంటే..
చరణం 1:
ఆమె: గాలిలో పరిమళానికేం తెలుసు..ఎగిసిపడే భావాల రాగాలు
కలలో కిరణానికేం తెలుసు..తొలివేకువ వెచ్చని పులకలు..
అతను: కదిలించే తోడిరాగం నువ్వేగా..మనసున లయమయ్యాక
వెలిగించే చూపుగారం నువ్వేగా..కన్నులు వియ్యమొందాక..
అల్లరి వెల్లువయ్యింది..
చరణం 2:
అతను: మబ్బుల్లో నీటికేం తెలుసు..తొలివలపు చినుకు తలపులు..
సద్దులేని క్షణాలకేం తెలుసు..మధురోహలు చిలుకు మువ్వలు..
ఆమె: చరణాలకు పల్లవి నువ్వేగా..పాట పల్లకినెక్కాక..
వెచ్చనైన మోహం నువ్వేగా..ఊహలు నిజమయ్యాక..
ఆనందం మేఘమయ్యింది.....

Tuesday, 17 November 2015

పాట : 31:తొలివలపు తీపయ్యింది..తొలి అడుగు నీతో కలిపానని..


పల్లవి:
తొలివలపు తీపయ్యింది..తొలి అడుగు నీతో కలిపానని..
తొలిపిలుపు మధువయ్యింది...తొలి పలుకు నిన్నే పిలిచిందని..
మనసంతా నువ్వే..మధువే నువ్వైతే..
మనసంతా సందడే..వరుడే నువ్వైతే..

చరణం 1:
మూగసైగలే నేర్చింది మది నీ జతలో..
మూగబాసలే కోరింది మరి మన కధలో
పగటివెన్నెలే కాసింది సిరి మన కలలో..
రాగాలనే నేసింది మది నీ వలలో..
ఊసులే మనసైనవి..నిద్దుర కరువైన వేళ
ఊహలు నిజమవ్వాలి ఇద్దరమొకటయ్యే వేళ
మనసంతా సందడే..వరుడే నువ్వైతే.. 

చరణం 2:
కొంటెచూపు తెలిపింది కొసరిన నీ ప్రేమ..
ఆనందమై ఎగిసింది వేకువై నా లోన..
అరనవ్వులో చేరింది విరిసిన నీ ప్రేమ
అరవిందమై మెరిసింది అలలై నా లోన..
ఊపిరి బరువవ్వదా చెంత నీవున్న వేళ
వెన్నెలే ప్రియమవునుగా మల్లెలే నవ్విన వేళ..
మనసంతా నువ్వే..మధువే నువ్వైతే..  

పాట : 30 :జాలిలేని జాబిలిలా నువ్వు..


పల్లవి: 

జాలిలేని జాబిలిలా నువ్వు..
ఎక్కడున్నావో..ఏం చేస్తున్నావో..
ఎడారి కాచే వెన్నెలలా..
నన్నెందుకిలా చేసావో..ఎందుకు మరచావో..
నమ్మలేకున్నా నేటిని..నువ్వు దూరమైన నిజాన్ని..

చరణం 1:

కాటుకకన్నులు నిద్దుర మరచినవి..వెతికి నిన్ను అలసినంతనే..
పెదవి చివరలు విరుగుతున్నవి..నిన్ను కలవరించినంతనే..
మధురస్మృతులు రోదిస్తున్నవి..నిన్ను తలచినంతనే..
పగలురేయీ పగబట్టినట్లున్నవి..తాము కదలకుండానే..
ఎక్కడున్నావో..ఏం చేస్తున్నావో..
జాలిలేని జాబిలిలా నువ్వు..

చరణం 2:

నాలో నిన్నే వెతుకుతున్నా..మనసులో ఉంటావనుకొనే..
నువ్వే దిక్కని నిలబడి ఉన్నా..దిక్కులు నాలుగు నవ్వుతున్నా..
కలలో గుసగుసలకే కాచుకున్నా..నిద్దురనైనా నువ్వొస్తావనే..
సాయం పొద్దులు పొరబడుతున్నా..నయనం నీరయ్యిందనే..
నన్నెందుకిలా చేసావో..ఎందుకు మరచావో..
ఎడారి కాచే వెన్నెలలా..


పాట : 29 : ముద్దబంతి నవ్వింది మునిమాపుల్లో..



పల్లవి:
అతను: ముద్దబంతి నవ్వింది మునిమాపుల్లో..
పున్నాగు పూసింది కవ్వింతల్లో..
నీ నవ్వులా...విరబూతలా...
ఆమె: మల్లెమొగ్గ విచ్చింది ఆనందంలో..
మరువమే ముంచింది మధురోహల్లో..
నీ ప్రేమలా..మైమరపులా..

చరణం 1: 
అతను: తొంగిచూసే చందమామకే తెలుసు..రేయివెచ్చని ముచ్చట్లు..
ఊయలూగే పూలతీవెకే తెలుసు.అల్లరిగాలి గుసగుసలు..
ఆమె: సుగంధాల రేరాణికే తెలుసు మనసు వశీకరణాలు
తేలుతున్న వెండిమబ్బుకే తెలుసు చిలిపితారల సయ్యాటలు..
అతను: సంధ్యారాగం శృతి చేసింది..
ప్రేమకవితనే అనుపల్లవిగా..                //మల్లెమొగ్గ//

చరణం 2: 
ఆమె: అదురుతున్న లేతపెదవికే తెలుసు మధుర సుధలేమిటో..
బెదురుతున్న కంటిపాపకే తెలుసు చూపు చొరవేమిటో..
అతను: సొట్టబడ్డ పాలబుగ్గకే తెలుసు సిగ్గు ఎరుపేమిటో..
ఎగురుతున్న ముంగురులకే తెలుసు మనసు ఊసేమిటో..
ఆమె: వీణానాదం వివరిస్తోంది..
వలపుగీతాన్నే వసంతముగా...     //ముద్దబంతి//




పాట : 28 : ఏదోలా ఉంది మౌనానికి మాటలొస్తుంటే.



పల్లవి:
అతను: ఏదోలా ఉంది మౌనానికి మాటలొస్తుంటే..
వివరించాలనుంది మది మోహనమవుతుంటే..
ఆమె: ఏదోలా ఉంది చిరుగాలి కెరటమవుతుంటే..
వినిపించాలనుంది మది కోయిలవుతుంటే..

చరణం 1: 
ఆమె: చిలిపిలాహిరులవుతున్న స్వరాలు నిన్ను నే పాడుతుంటే.
వలపు చిగురులవుతున్న స్నేహాలు నువ్వు కలవై వస్తుంటే..
అతను: కన్నులు కలిపానందుకే చూపుతో తడిమేందుకే..
చేతులు చాచానందుకే చెలిమిని అందించేందుకే..
ఆమె: కలిసిన కన్నుల కోలాటాలు..
చేతులు కలిసిన సంచలనాలు మనవే......

చరణం 2: 
అతను: నిదుర కరువౌతున్న రాతురులు నువ్వు తలపుకొస్తుంటే..
తొలిపొద్దు వెన్నెలవుతున్న ఆనందాలు నిన్ను కలవరిస్తుంటే..
ఆమె: పెదవులు నవ్వాయందుకే తీయగా పలకరించేందుకే..
అడుగులు కదిపానందుకే కలిసి నీతో నడిచేందుకే..
అతను: విరిసిన పెదవుల తియ్యదనాలు..
కలిసిన అడుగుల సంతోషాలు మనవే..






పాట : 27 : Navaraatri : జయములొసగు శ్రీదేవిని అర్చింతుము రారమ్మా


Hi friends..Today I wrote a devotional song on Account of Auspicious Navaratri 

పల్లవి:

జయములొసగు శ్రీదేవిని అర్చింతుము రారమ్మా
శుభములొసగు శివంకరిని పూజింతుము రారమ్మా
జయజయ జయలక్ష్మీ జయ విజయలక్ష్మీ

చరణం 1:

ఆశ్రితులకు అభయమిచ్చు శ్రితకల్పవల్లి
పదారువన్నెల చందురుని సోదరి పాలవెల్లి
ముచ్చటగొలుపు మాయమ్మా
సిరులు చిందించు తల్లివమ్మా
మంగాపురమున పద్మావతిగా వెలసినావమ్మా..

చరణం 2:
జగములన్నీ కొలచే తల్లి శ్రీమాతవు నీవే..
శత్రు భయంకరి ఆపన్నివారిణి సత్యస్వరూపిణీ నీవే..
నవపద్మ పావనివి నీవమ్మా
మధురమీనాక్షివీ నీవమ్మా
శ్రీపీఠ సింహాసినిగా నిన్ను కొలుతుమమ్మా..








పాట : 26 : ప్రియతమ సఖుడా..



పల్లవి: ప్రియతమ సఖుడా..
శుభోదయమయ్యింది నేడు నీకు శుభాకాంక్షలు అందించేందుకే..
వసంతోత్సవం ఓలలాడింది చూడు నిన్ను పలకరించేందుకే..
అందుకో ప్రియతమ..మనసైన మధురవచన..
Happy Birthday to U...
Every word is sounding like a lyric..when I'm calling U..
Every thought is becoming a poem..when I'm writing U..

చరణం 1: దూరాలెందుకు లెక్కిస్తావో తలపుల్లో నీ చెంతనేనుండగా
నీ ఆత్మానందం నేనయ్యాగా మక్కువగా నన్నే తలవగా
చిగురించిన ప్రేమ నేనేగా నీ హృదయానందమునా..
వెన్నెల మంచుబిందువును నేనేగా నీ హేమంతవేకువనా..
అందుకో ప్రియతమా...మనసైన మధురవచనా...


చరణం 2: ఎన్నెన్ని పూజలు చేసానో నిను గెలిచే తపనే తీరగా
కలభాషణలెన్ని నేర్చానో నిను వలచిన ఆ రోజునా ..
విరహించిన వరూధిని నేనేగా నిను ప్రేమించినందునా..
నువ్వాశించిన మకరందమైపోనా అరవిరిసిన పువ్వుల నడుమనా..
అందుకో ప్రియతమా...మనసైన మధురవచన... 

పాట : 25 : ఏదో చెప్పలనుంది..మనసులోని మాట.

Hi friends..My Romantic Duet for this Week..:)


పల్లవి: 

అతను: ఏదో చెప్పలనుంది..మనసులోని మాట..
నువ్వు మెచ్చి వినాలనుకొనే మరుమల్లె మాట..
ఆమె: ఏదో వినాలనుంది..నీ మదిలో మాట..
నేను నచ్చి మెచ్చాలనుకొనే అరుదైన మాట..

చరణం 1: 

ఆమె: గుప్పిళ్ళు తెరిచింది గోరువంక..
గుండెల్లో నేనున్నానని చెప్పేందుకే..
పెదవుల్లో పూసింది నెలవంక..
నవ్వుల్లో చేరానని తెలిపేందుకే..
అతను: గుండెల్లో చేరినా..నవ్వుల్లో చేరినా..
నువ్వుంది నాలోనేగా...నేనుంది నీలోనేగా...      //ఏదో వినాలని//

చరణం 2:

అతను: కౌగిళ్ళు కోరాయి కొన్నందాలు..
మనసైన నీ పొందు కావాలనే..
సందళ్ళు చేసాయి సన్నాహాలు..
వరసైన నిను చేరి విరియాలనే..
ఆమే: కౌగిళ్ళు కోరినా..సందళ్ళు చేసినా..
సమయం రావాలిగా..మనమొకటై మిగలాలిగా..    //ఏదో చెప్పాలని//




పాట : 24 :Solo Song : ఇరుమనసుల మూగగీతం నాలుగుపెదవుల ప్రణయకావ్యం..


Dear friends...My Today's Solo song sung by Hero in rememberance of Heroine..

పల్లవి..

ఇరుమనసుల మూగగీతం నాలుగుపెదవుల ప్రణయకావ్యం..
ఇరునయనాల కోలాటం ఓ రసాత్మక ఝరీప్రవాహం..
చేమంతి నీ నవ్వులే అరుణిమలాయే..
చెలి పూబంతి మేనంతా పులకింతలాయే..
ఓహో చెలి..నా ప్రియ నెచ్చెలి..

చరణం 1:

కన్నుల్లో సూర్యోదయాలెన్నో రెపరెపలాడినట్లు
పెదవుల్లో చంద్రోదయాలు నెలవంక నవ్వినట్లు
పగలూ రేయిని గుర్తించలేకున్నా..నీ మాయలోనే నే మునిగిపోతున్నా..
ఓహో  చెలీ..కరిగించవా నన్నిలా..
దరిచేరి ఒడే చేర్చవా..

చరణం 2:

అడుగుల్లో కలహంస గమనం మెరుపు కదిలినట్లు..
మనసంతా మధురసం అందాన్ని పానం చేసినట్లు
కలయో నిజమో తెలుసుకోలేకున్నా...వింతైన హాయిలో తేలిపోతున్నా..
ఓహో చెలీ...స్వాగతించవా నన్నిలా
పల్లవించవా నాదానిగా..


పాట : 23 : అల్లిబిల్లి కలలే కన్నులలో నిదురను మరచిన రాతిరిలో


Good Afternoon Friends..My Cool Romantic Duet for This Tremendous Hot Weather..:) 

పల్లవి:
ఆమె: అల్లిబిల్లి కలలే కన్నులలో నిదురను మరచిన రాతిరిలో..
రవ్వంత రాగాలేవో వినబడుతుంటే..నాలో..
అతను: వెన్నెలలే విరిసే పెదవులలో  మనసును గెలిచిన మోహములో..
చెప్పలేని భావాలేవో కదలాడుతుంటే..నాలో

చరణం 1:
ఆమె: మెరుపులు మెరిసే మేనిలో నీ చూపుకే..
పులకలు పుట్టే మనసులో నీ నవ్వుకే..
అతను: ఏమందునో ఇన్ని గిలిగింతల కవ్వింపును..
మాటలకందని సుగంధాల మరువంపును..
రవ్వంత రాగాలేవో వినబడుతుంటే..నీలో..        //వెన్నెలలే//

చరణం 2:

ఆమె: చెంగలువలు పూచే బుగ్గల్లో..నీ తలపుకే
మధురోహలూగే తనువులో..నీ పిలుపుకే..
అతను: ఏమందునో మరో వసంతపు ఆగమనము..
ఆనందపు వేణువేదో శృతిచేస్తుంటే..నాలో..
చెప్పలేని భావాలు కదలాడుతుంటే..నీలో..             // అల్లిబిల్లి//





పాట : 22 : వింటున్నా గలగలలు నీ మౌనంలోనే గమ్మత్తుగా



పల్లవి:

ఆమె: వింటున్నా గలగలలు నీ మౌనంలోనే గమ్మత్తుగా
నీ మౌనం మాటాడుతోంది నాతో సరికొత్తగా
ఏమయ్యిందో మరి..ఓ గడుసరి..
అతడు: చూస్తున్నా కళకళలు నీ కన్నుల్లోనే వింతగా
నీ చూపు వేటాడుతోంది నన్నే తొలిమత్తుగా.. 
ఏమవుతోందో మరి..ఈ తొలకరి.. 

చరణం 1: 
ఆమె: వెన్నెలబొమ్మై కరిగిపోతున్నా నీ వలపులపిలుపులు విన్నంతనే
జాజికొమ్మనై పరిమళిస్తున్నా నీ తలపునెత్తావుల మధురిమలకే
అతను: కంటున్నా మిసమిసలు నీ పెదవుల కవ్వింతల్లోనే..
వింటున్నా గుసగుసలు నీ ఊసుల గమ్మత్తుల్లోనే..
ఏమవుతోందో మరి..ఈ తొలకరి.. 

చరణం 2: 

అతను: వసంతరాగమై మురిసిపోతున్నా నీ భావములో తడిచినంతనే..
ఇంద్రధనస్సునై వెలిగిపోతున్నా నీ వర్ణాలను తాకినంతనే..
ఆమె: మనసంతా సరిగమలు..నీ ఆలాపన స్వరజతుల్లో..
తనువంతా ఘుమఘుమలు నీ ఆరాధన పులకింతల్లో..
ఏమయ్యిందో మరి..ఓ గడుసరి..

పాట : 21 : Romantic Duet : ఎండలన్నీ వెన్నెలాయే నీతో కలసి అడుగేస్తుంటే..


Good Afternoon Friends..My Romantic Duet for this week..:)


పల్లవి:

ఆమె: ఎండలన్నీ వెన్నెలాయే నీతో కలసి అడుగేస్తుంటే..
నవ్వులన్నీ పువ్వులాయే నాలో నిన్ను ఊహిస్తుంటే..
వలపాయెనే..నీ చూపులో చేరగానే..
ఏదో వలపాయెనే..నీ నవ్వులో మత్తుగానే..

అతడు.. రాతిరంతా వెచ్చనాయే నీ తోడై కలిసుంటే
శ్వాసలన్నీ గంధమాయే..నీ స్పర్శే సోకుతుంటే..
మనసాయెనే..నీ కౌగిలిలో ఒదిగినంతనే..
మరిమరి మనసాయెనే..నీ గీతంలో పలికినంతనే..

చరణం 1:
ఆమె: సిరిమల్లె సొగసంతా నీకిచ్చేసా..నీ ప్రేమలో కరిగినప్పుడే..
నానాటి విరహమంతా విడిచిపెట్టా నీ మదిలో చేరినప్పుడే..
అతడు: సంగీతం నువ్వేగా నా అనురాగ గీతాలకు
సల్లాపం నువ్వేగా నా మౌనరాగాలకు..
నువ్వేగా..నా నువ్వేగా...
ఆమె:వలపాయెనందుకే..నీ చూపులో చేరినందుకే..

చరణం 2:
ఆమె: కెమ్మోవినవ్వులు నీకందించా..నీ గానానికి మురిసినప్పుడే..
సంతోషానికి సంతకం చేసేసా..నీ గమ్యం నేనైనప్పుడే..
అతడు: మధుమాసం నువ్వేగా నా చిన్నారి కలలకు ..
సౌందర్యం నువ్వేగా నా వలపు కెరటాలకు..
ఆమె: మనసాయెనందుకే..నీ కౌగిలిలో చేరినందుకే..

పాట : 20 : వియోగాల చెరనుండీ విడుదలెన్నడో..

Good Afternoon Friends..My Solo Sad Song for Today..


పల్లవి:

వియోగాల చెరనుండీ విడుదలెన్నడో..
విరహమైన రాతిరికి వేడుకెన్నడో..
వివరించలేని దిగులు రేయీపగలూ
ఏమని పాడను నా వేదనను..
ఎలా వినిపించను ఆవేదనను..

చరణం 1:
వెన్నెలై కాటేస్తూ కలౌ దరిచేరే మార్గం చెప్పమంటూ
శిశిరమై రాలుతున్న ఆశలు వసంతమెన్నడోనని వేగిపోతూ..
అందని జాబిల్లిలా ఆకాశంలో నీవుంటే
దిక్కుతోచని అభిసారికనై నీకోసం చూస్తుంటే..
ఏమని పాడను నా వేదనను..

చరణం 2:
చెక్కిలిపై కురుస్తున్న కన్నీరు వెల్లువై మదిలోకి జారుతుంటే..
మదిలోన చిగురించిన ఊహలు రగిలే తాపానికే ఆరిపోతుంటే..
సముద్రానికావలి తీరంలో నీవుంటే..
యుగయుగాల నిరీక్షణలో నే వేసారిపోతుంటే..
ఏమని పాడను నా వేదనను..