పల్లవి:
అతను: ముద్దబంతి నవ్వింది మునిమాపుల్లో..
పున్నాగు పూసింది కవ్వింతల్లో..
నీ నవ్వులా...విరబూతలా...
ఆమె: మల్లెమొగ్గ విచ్చింది ఆనందంలో..
మరువమే ముంచింది మధురోహల్లో..
నీ ప్రేమలా..మైమరపులా..
చరణం 1:
అతను: తొంగిచూసే చందమామకే తెలుసు..రేయివెచ్చని ముచ్చట్లు..
ఊయలూగే పూలతీవెకే తెలుసు.అల్లరిగాలి గుసగుసలు..
ఆమె: సుగంధాల రేరాణికే తెలుసు మనసు వశీకరణాలు
తేలుతున్న వెండిమబ్బుకే తెలుసు చిలిపితారల సయ్యాటలు..
అతను: సంధ్యారాగం శృతి చేసింది..
ప్రేమకవితనే అనుపల్లవిగా.. //మల్లెమొగ్గ//
చరణం 2:
ఆమె: అదురుతున్న లేతపెదవికే తెలుసు మధుర సుధలేమిటో..
బెదురుతున్న కంటిపాపకే తెలుసు చూపు చొరవేమిటో..
అతను: సొట్టబడ్డ పాలబుగ్గకే తెలుసు సిగ్గు ఎరుపేమిటో..
ఎగురుతున్న ముంగురులకే తెలుసు మనసు ఊసేమిటో..
ఆమె: వీణానాదం వివరిస్తోంది..
వలపుగీతాన్నే వసంతముగా... //ముద్దబంతి//
No comments:
Post a Comment